త్వరలో తెలుగులో రాజ్యసభ ప్రొసీడింగ్స్

By రాణి  Published on  14 Dec 2019 7:48 AM GMT
త్వరలో తెలుగులో రాజ్యసభ ప్రొసీడింగ్స్

ముఖ్యాంశాలు

  • మాతృభాషపై మమకారాన్ని చాటుకున్న రాజ్యసభ చైర్మన్
  • పూర్తిగా తెలుగులో సభను నిర్వహించాలని ఆశ
  • సహకరించాలని సభ్యులందరికీ విజ్ఞప్తి
  • షెడ్యూల్డ్ భాషల్లో ప్రసంగాలు చేయాలని కోరిన చైర్మన్
  • పార్లమెంట్ లో తెలుగులో మాట్లాడుతున్న పలువురు ఎంపీలు

త్వరలోనే రాజ్య సభలో ప్రొసీడింగ్స్ ను తెలుగులో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆఖరి రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కనీసం ఒక్క రోజైనా పూర్తి స్థాయిలో తన మాతృభాష అయిన తెలుగులో రాజ్య సభ సమావేశాలను నిర్వహించాలన్న ఆశను వెంకయ్యనాయుడు వ్యక్తం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హిందీ మాట్లాడే ప్రాంతాలనుంచి చట్టసభలకు ఎన్నికైన సభ్యులు కూడా దీనికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని రాజ్యసభ చైర్మన్ కు తెలిపినట్టుగా సమాచారం.

చట్ట సభల్లో తమ మాతృభాషలో ప్రసంగించే సభ్యుల తీరును వెంకయ్యనాయుడు ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానివల్ల తాము ఎన్నుకున్న సభ్యులు చట్ట సభల్లో అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏ సమస్యలపై స్పందిస్తున్నారో తెలుసుకునే అవకాశం సామాన్యులకు కూడా కలుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగతా అన్ని ప్రాంతాల నుంచి చట్ట సభలకు ఎన్నికైన సభ్యులు వారి వారి భాషల్లో మాట్లాడడం, చర్చల్లో పాల్గొనడం అభినందనీయమైన పరిణామమని వెంకయ్య నాయుడు అన్నారు.

భవిష్యత్తులోకూడా ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతానికి సంబంధించిన భాషలోనే సభలో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ (పౌరసత్వ సవరణ) బిల్లుపై చర్చ సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు తెలుగులో ప్రసంగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. సభ ఏర్పాటైన 67 సంవత్సరాల తర్వాత 22 షెడ్యూల్డ్ భాషల్లో ఒకటైన సంథాలీ భాషలో ఒక సభ్యుడు ప్రసంగం చేయడం ఎంతో గొప్ప విషయంగా తాను భావిస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు.

Next Story