తెలుగు వెలుగును పెంచిన గిడుగు.. నేడు తెలుగు భాష దినోత్సవం

By సుభాష్  Published on  29 Aug 2020 10:57 AM GMT
తెలుగు వెలుగును పెంచిన గిడుగు.. నేడు తెలుగు భాష దినోత్సవం

అమ్మతో కష్టసుఖాలు పంచుకునే భాష ప్రస్తుత కాలంలో బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు.

భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము. కానీ గిడుగు రామ్మూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో.. ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు.

తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. అయితే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

గిడుగు రామ్మూర్తి జననం:

గ్రాంధీక భాషలోని తెలుగు వచనాన్ని వాడుకలోకి తీసుకొచ్చి భాష గురించి తెలియజేసిన మహానీయుడు గిడుగు రామ్మూర్తి శ్రీకాకుళానికి 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం సమీపంలో ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు.

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవర ల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో పాఠశాలలు ఏర్పాటు చేసి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు గిడుగు రామ్మూర్తి. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహదూర్‌" బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నాడు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు. గిడుగు రామ్మూర్తి జీవిత కాలంలో చేపట్టిన కృషి వల్ల ఎన్నో శాఖలు విస్తరించాయి.

తెలుగు భాష కోసం ప్రభుత్వం ముందుకు..

తెలుగు భాష మాతృ భాషను పాఠశాలల్లోనూ సజీవంగా ఉంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష కనుమరుగు కాకుండా ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ సందర్బంగా వేమన, సుమతీ శతకాలు వంటి పద్యాలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అందించి విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

Next Story