తెలుగు ఛానెళ్ల సెలెక్టివ్ హిందుత్వవాదం – అసలు టార్గెట్ ఎవరు?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 12:13 PM ISTఈ మధ్య తెలుగు మీడియాలో సరికొత్త కాషాయీకరణ జరుగుతోంది చూశారా? మామూలుగా దేవుడిని నమ్మేవాడిని ఎద్దేవా చేసేవాళ్లు, హిందూ అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు సెక్యులర్ సూక్తులు వల్లించేవారు హఠాత్తుగా హిందూ ధర్మంపై దాడి విషయంలో గగ్గోలు పెట్టేస్తున్నారు. కాషాయ స్వాములను పిలిచి, ధర్మ ప్రచారకులను పిలిచి డిస్కషన్లు దంచేస్తున్నారు.
మొన్నటికి మొన్న ఒక పేరు మోసిన చానెల్ టీటీడీలో ఒక ఉద్యోగి చర్చికి వెళ్లోందన్న విషయాన్ని కొత్తగా కనిపెట్టినట్టు టీవీలో డిబేట్ పెట్టి, సదరు విడియోను పదే పదే చూపించి హడావిడి చేసేసింది. సహజంగా ఆవేశపరులైన హిందూవాదులు ఈ చానెల్ ను అభినందించేశారు కూడా. ఇంకో టీవీ చానెల్ కూడా ఇలాంటిదే ఇంకో విషయం చేపట్టి దానిపై చర్చ పేరిట రచ్చ చేసింది. ఇంకో చానెల్ అన్నవరంలో ఒక భజన మండలి క్రైస్తవ భజనను పాడటం పై డిబేట్ పెట్టేసింది. అంతకు ముందు టీటీడీ టికెట్లపై జెరూసలేం యాత్ర వ్యాపార ప్రకటనల విషయంలో వివాదం చెలరేగింది.
ఈ చానెళ్లు ఉన్నట్టుండి హిందువులుగా ఎందుకు మారిపోయాయి? ఇన్నాళ్లూ హిందూ ఇష్యూలను చాపకింద తోసేసి, హిందూ వాదులను చానెళ్ల దరిదాపులకు కూడా రానీయని వారు ఈ రోజు హఠాత్తుగా ఎందుకు కాషాయం పులుముకుంటున్నారు? అంతకుముందు ఇలాంటి ఒక చానెల్ గేట్ ముందు హిందూ సంఘాలు ధర్నాలు కూడా చేశాయి. అంతటి హిందూ వ్యతిరేకత ఉన్న చానెల్ ఇప్పుడు క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల విషయంలో “ఆందోళన” చెందడానికి కారణం ఏమిటి?
ఇన్నాళ్లూ మీడియా హిందూ సన్యాసులను పట్టించుకోకపోయినా వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఆ పోరాటాల ఫలితం ఇప్పుడు చైతన్యపూరిత హిందూ సమాజం రూపంలో కనిపిస్తోంది. కానీ ఇప్పుడు క్రైస్తవం గురించి హఠాత్తుగా చానెళ్లు ఎందుకు మేల్కొన్నాయి? దీనిలో నిజాయితీ ఎంత ఉంది? నాటకం ఎంత ఉంది?
ఇవే చానెళ్లు ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి, హిందూ ముస్లిం అంశాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఒవైసీ చేస్తున్న వికృత వికార ప్రకటనల గురించి ఎందుకు డిబేట్లు పెట్టడం లేదు? కేవలం క్రైస్తవ అంశాలకే చర్చలు ఎందుకు పరిమితం అవుతున్నాయి? ఒక్కక్షణం ఆలోచిస్తే మీకు ఈ డిస్కషన్ల వెనుక రాజకీయం చాలా సులువుగా అర్థమైపోతుంది. ఈ చానెళ్లన్నీ ఒకే వర్గానికి చెందినవి. ఇన్నాళ్లూ ఒకే పార్టీకి కొమ్ము కాసినవి. అంతే కాదు. ఇప్పటికీ అదే పార్టీకి, అదే నాయకుడికి కొమ్ముకాస్తున్నాయి. వీరి లక్ష్యం హిందుత్వ పరిరక్షణ కాదు. హిందూ ప్రయోజనాలు వీరికి పట్టవు. సదరు నాయకుడి రాజకీయ విరోధి క్రైస్తవుడు. ఆయన, ఆయన కుటుంబం తమ మత విశ్వాసాలను దాచుకోరు. కాబట్టి మిషనరీ వ్యతిరేక కథనాల ద్వారా అన్యాపదేశంగా ఆయనను అటాక్ చేయొచ్చు. పైగా వీరి ఆరాధ్య నాయకుడికి ప్రస్తుతం బిజెపి కృపాదృష్టి కావాలి. అందుకే ఈ “కృపాపండుగలు” చేసేస్తున్నారు.
- రాకా సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్