తన పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? ఈ ట్వీట్ ఏం చెబుతోంది?

వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాహుల్‌గాంధీకి..

By Srikanth Gundamalla  Published on  19 Jun 2023 6:58 AM GMT
YSRTP, Congress, Sharmila, Rahul Gandhi Birthday

తన పార్టీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? ఈ ట్వీట్ ఏం చెబుతోంది?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పుట్టిన రోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిపిస్తున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పలు చోట్ల కేక్‌లు కట్‌ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాల్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు కూడా సోషల్‌మీడియా ద్వారా ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా రాహుల్‌గాంధీకి ట్విట్టర్‌ ద్వారా బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ వైరల్‌గా మారింది.

తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలన తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ స్థాపించింది షర్మిల. అయితే.. ఈ మధ్య కాలంలో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాహుల్‌గాంధీకి షర్మిల బర్త్‌డే విషెస్ చెబుతూ ట్వీట్‌ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పార్టీ విలీనానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలంగాణ రాజకీయ పార్టీల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో షర్మిల ట్వీట్‌ మరింత ఆసక్తిని పెంచుతోంది.

షర్మిల్ ట్వీట్‌తో పలువురు ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశం ఖాయమైందని.. అందుకు షర్మిల ట్వీట్‌ బలం చేకూరుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే.. గతంలో వైఎస్‌ షర్మిలను పలువురు కాంగ్రెస్‌ నేతలు కలిశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ షర్మిలతో ఫోన్లో మాట్లాడి చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేయాలని కోరారు. షర్మిల కూడా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. గతంలో పొత్తులపై కొన్ని ఆఫర్లు వస్తున్నాయని షర్మిల మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల రెండుసార్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కూడా పొత్తు, విలీనంపై చర్చలు జరిగినట్లు ప్రచారం జరిగింది. పొత్తుకు అయితే షర్మిల ఓకే చెబుతున్నారని.. కానీ కాంగ్రెస్‌ మాత్రం విలీనంపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా షర్మిల రాహుల్‌కు బర్త్‌డే విష్‌ చేస్తూ ట్వీట్‌ చేయడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. కాంగ్రెస్‌ ఆఫర్‌ను షర్మిల అంగీకరిస్తుందనే పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story