YS Sharmila : టీఎస్పీఎస్సీ ముట్ట‌డికి య‌త్నం.. వైఎస్ ష‌ర్మిల అరెస్ట్‌

టీఎస్పీఎస్సీ కార్యాల‌యం ముట్ట‌డికి య‌త్నించిన వైఎస్ ష‌ర్మిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2023 12:32 PM IST
TSPSC office, YS Sharmila

వైఎస్ ష‌ర్మిల

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే వంద‌లాది మంది విద్యార్థులు ఆగ‌మాగం అవుతున్నార‌ని విరుచుకుప‌డుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు. ఈ క్ర‌మంలోనే వైఎస్ఆర్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల శుక్ర‌వారం టీఎస్పీఎస్సీ ముట్ట‌డికి పిలుపునిచ్చారు.

ఈ నేప‌థ్యంలో నేడు నాంప‌ల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాల‌యం వ‌ద్ద‌కు ష‌ర్మిల వ‌చ్చారు. టీఎస్పీఎస్సీ కార్యాల‌యం ముట్ట‌డికి య‌త్నించారు. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ షర్మిల కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ శ్రేణులు కూడా రోడ్డుపై నిర‌స‌న దీక్ష‌కు కూర్చోవ‌డంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్ప‌డింది. దీంతో ష‌ర్మిల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంత‌క‌ముందు ష‌ర్మిల మాట్లాడుతూ.. పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో పెద్ద‌వ్య‌క్తుల‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. చిన్న వాళ్ల‌ను దోషులుగా చిత్రీక‌రిస్తున్నార‌న్నారు. ఆందోళనకు పిలుపునివ్వగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారని ష‌ర్మిల మండిప‌డ్డారు. "బ‌య‌ట‌కు వెళ్లాలి అంటే ఇత‌ర కార‌ణాలు చూపించి న‌న్ను నిర్భందిస్తున్నారు. నా ఇంటి చుట్టూ వంద‌లాది మంది పోలీసుల‌ను మోహ‌రించారు. నాకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు. లుక్ అవుట్ ఆర్డ‌ర్ ఇవ్వ‌డానికి నేనేమైనా క్రిమిన‌ల్‌నా" అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

Next Story