వైఎస్ షర్మిల అరెస్ట్

YSRTP Chief Sharmila arrested.వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2021 8:45 AM GMT
వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌తి మంగ‌ళ‌వారం ష‌ర్మిల..నిరుద్యోగుల‌కు మ‌ద్దుతుగా దీక్ష చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా నేడు బోడుప్ప‌ల్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో దీక్ష చేప‌ట్టాల‌ని ష‌ర్మిల నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ష‌ర్మిల దీక్ష‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఈ ఉదయం ఉద్రిక్తత నెలకొంది.

ఆత్మ‌హ‌త్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. దీక్ష‌కు అనుమ‌తి లేక‌పోయినా.. బోడుప్పల్‌లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు ష‌ర్మిల‌. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత ఆమె మేడిపల్లి పీఎస్‌కు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో.. పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వైఎస్సార్ టీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో పోలీసులు.. ష‌ర్మిల‌ను ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అంత‌క‌ముందు ష‌ర్మిల మాట్లాడుతూ.. వందల మంది నిరుద్యోగులను పొట్టనపెట్టుకున్న హంతకుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామనే తమ దీక్షకు అనుమతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్ర‌తిపక్ష పార్టీలపైనా షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా నిద్రపోయిన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు గర్జనలు, పాదయాత్రలు అంటూ హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్‌ రెడ్డి కనీసం పరామర్శించలేదని.. అలాంటిది ఆయ‌న్ని తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. కేసీఆర్‌కి కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిందని.. ఆ పార్టీ నిజంగా ప్రతిపక్ష పాత్ర వహిస్తే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవా? అని ప్ర‌శ్నించారు.

Next Story