షర్మిల పాదయాత్రకు బ్రేక్‌.. షోకాజ్‌ నోటీసు ఇచ్చిన పోలీసులు

YS Sharmila's padayatra yet to resume as police serve show cause notice. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో

By అంజి  Published on  4 Dec 2022 12:42 PM IST
షర్మిల పాదయాత్రకు బ్రేక్‌.. షోకాజ్‌ నోటీసు ఇచ్చిన పోలీసులు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో ఆదివారం వరంగల్ జిల్లాలో పాదయాత్ర తిరిగి ప్రారంభం కాలేదు. గతంలో అనుమతి ఇచ్చే సమయంలో విధించిన షరతులు ఉల్లంఘించారని, అనుమతి కోసం దరఖాస్తును ఎందుకు తిరస్కరించకూడదో వివరించాలని కోరుతూ వరంగల్ జిల్లా పోలీసులు ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనిపై షర్మిల స్పందిస్తూ.. వరంగల్ పోలీసులకు న్యాయపరమైన సమాధానం అందజేస్తామని చెప్పారు.

పాదయాత్ర పున:ప్రారంభానికి ఇప్పటికైనా పోలీసులు అనుమతి ఇవ్వకుంటే న్యాయపోరాటం చేస్తామని ఆమె తెలిపారు. నవంబర్ 28న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) కార్యకర్తలు దాడి చేశారన్న ఆరోపణలతో పాదయాత్ర నిలిపివేసిన నర్సంపేటలోని లింగగిరి క్రాస్ నుండి పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని షర్మిల భావించారు. స్థానిక ఎమ్మెల్యేపై షర్మిల చేసిన కొన్ని వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకారులు ఆమె బస్సుకు నిప్పు పెట్టారు. ఇతర వాహనాలపై రాళ్లు రువ్వారు. అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో షర్మిల పాదయాత్రను విరమించేందుకు నిరాకరించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఆ తర్వాత పోలీసులు షర్మిలను హైదరాబాద్‌కు తరలించారు. మరుసటి రోజు షర్మిల ముఖ్యమంత్రి అధికారిక నివాసం వైపు నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుండగా హై డ్రామా మధ్య మళ్లీ అరెస్టు చేయబడ్డారు. ఘర్షణలో దెబ్బతిన్న కారును ఆమె నడుపుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నివాసం ఎదుట నిరసనకు దిగాలనుకున్నారు. అయితే పోలీసులు ఆమెను దారిలో అడ్డుకున్నారు. ఆమె కారులో నుంచి బయటకు రావడానికి నిరాకరించడంతో పోలీసులు కారును క్రేన్‌ సహాయంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల, మరికొందరు వైఎస్ఆర్టీపీ నేతలపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు వైఎస్‌ఆర్‌టీపీ పాదయాత్రను పునఃప్రారంభించేందుకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 1న వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి, హైదరాబాద్‌లో ఆమెను అరెస్టు చేసిన తీరుపై హోం మంత్రిత్వ శాఖ, డీజీపీ కార్యాలయం నుంచి నివేదిక ఇవ్వాలని కోరారు.

గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమాయకుల గొంతులను నొక్కుతోందని షర్మిల ఆరోపించారు. నిబద్ధతతో ఉన్న పార్టీ కార్యకర్తల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, తన పాదయాత్రపై దాడులు కొనసాగుతున్నాయని షర్మిల గవర్నర్‌తో అన్నారు. మరుసటి రోజు.. ఆమె శుక్రవారం తిరిగి ప్రారంభించే తన పాదయాత్రకు తగిన భద్రత కల్పించేలా పోలీసు అధికారులను ఆదేశించాలని కోరుతూ డిజిపి మహేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రాజకీయ ప్రేరేపిత 'సామాజిక వ్యతిరేకుల'పై చర్యలు తీసుకోవాలని, పార్టీ కార్యకర్తల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉందని ఆమె డిజిపిని కోరారు.

వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా తనను టార్గెట్ చేస్తారంటూ అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆమె అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల 2021 అక్టోబర్‌ 20న 4,000 కిలోమీటర్ల మేర 'ప్రజా ప్రస్థానం పాదయాత్ర' ప్రారంభించగా.. గత వారం 3,500 కిలోమీటర్లు పూర్తి చేశారు.

Next Story