కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్‌ షర్మిల భేటీ

తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి సోమవారం బెంగళూరులోని

By అంజి  Published on  29 May 2023 12:03 PM IST
YS Sharmila, DK Shivakumar, Bangalore

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్‌ షర్మిల భేటీ

తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోదరి షర్మిలారెడ్డి సోమవారం బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోను కర్ణాటక డిప్యూటీ సీఎం కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. వీరూ సుమారు 30 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిద్దరి భేటీలో తెలంగాణ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గతంలో వైఎస్‌ఆర్‌టీపీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తులు కుదరొచ్చు అంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిని అప్పట్లోనే షర్మిల తోసిపుచ్చారు. ఇప్పుడు డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలో గెలుపుతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్‌ తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కసరత్తులు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు భావ సారూప్యత గల పార్టీలను కలుపుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌టీపీపై కాంగ్రెస్‌ దృష్టి పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇదే నిజమైతే షర్మిల వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తారా? లేక పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story