సెటైర్లు వేస్తూ ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ

వైఎస్‌ షర్మిల బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బహిరంగ లేఖ రాశారు.

By Srikanth Gundamalla  Published on  6 Sept 2023 3:30 PM IST
YS Sharmila, Letter, MLC kavitha, Telangana, Politics,

సెటైర్లు వేస్తూ ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బహిరంగ లేఖ రాశారు. మహిళా బిల్లుకు మద్దతు కోరుతూ ఎమ్మెల్సీ కవిత లేఖ రాయగా.. తాజాగా ఆ లేఖకు రిప్లై ఇచ్చింది. మహిళా బిల్లుకు మద్దతు కోరుతూ కవిత రాసిన లేఖ అందిందనీ.. తెలంగాణలో మహిళలకు న్యాయం చేయకుండా ఈ పోరాటాన్ని జాతీయ వేదికపై ఎలా తీసుకువెళ్తారు అంటూ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పాలన తీరును ప్రశ్నిస్తూ లేఖలో సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్‌ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి దాకా మహిళలకు 5 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించలేదని షర్మిల అన్నారు. అంతేకాదు.. మంత్రి వర్గంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. సీఎం కూతురిగా తండ్రిని ఏనాడూ ఈ అంశంపై కవిత ప్రశ్నించలేదని అన్నారు షర్మిల. బీఆర్ఎస్‌ పార్టీతో పాటు.. ప్రభుత్వంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఢిల్లీ వేదికగా ఉద్యమం చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్‌పై ముందు బీఆర్ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్‌ తరఫున సీట్లు మహిళలకు ఎక్కువ ఇవ్వాలని.. ఆ తర్వాత ఈ ఉద్యమంలో మొదటి అడుగు అవ్వాలని కవితకు రాసిన లేఖలో షర్మిల సూచించారు.

ఇక్కడ తేల్చకుండా ఢిల్లీ వేదికగా ఉద్యమం చేయడం BRS ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు షర్మిల. తెలంగాణలో మహిళలను బీఆర్ఎస్‌ ప్రభుత్వం అణగదొక్కిందని.. దాడులు చేసి కించపరిచారని షర్మిల అన్నారు. ఉన్నట్లుండి మహిళా రిజర్వేషన్లు అంటూ ముందటేసుకున్న మీ ఆంతర్యం ఏంటి? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మహిళల నుంచి వచ్చే వ్యతిరేకత దృష్ట్యా నష్ట నివారణ చర్యల్లో ఇది ఒక ఎత్తుగడేనా అని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. మహిళగా తెలంగాణ అసెంబ్లీలో, పార్లమెంట్‌లో హక్కుల కోసం జరిపే పోరాటంలో తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కానీ.. మహిళా రిజర్వేషన్‌ విషయంలో బీఆర్ఎస్ రాజకీయ క్రీడలో తాను భాగం కాలేనని లేఖలో తెలిపింది. తెలంగాణ మహిళా వాదాన్ని చేపట్టి, కేసీఆర్‌ను కవిత నిలదీస్తే అప్పుడు సంపూర్ణ మద్దుతు ఇస్తానని చెప్పారు. తెలంగాణ మహిళా వాదాన్ని మీరు భుజంపైకి ఎత్తుకుంటే మీతో కలిసి పోరాటం చేసే తొలి మహిళ తానే అవుతానని షర్మిల తెలిపారు.

Next Story