వైఎస్ షర్మిల ఖమ్మం సంకల్ప సభ నేడే..
YS Sharmila Khammam Sankalpa Sabha. వైఎస్ షర్మిల ఖమ్మం సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది.
By Medi Samrat
వైఎస్ షర్మిల ఖమ్మం సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని నివాసం నుంచి షర్మిల ఖమ్మం బయలుదేరారు. పంజాగుట్టలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల.. అభిమానుల్ని కలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో షర్మిలకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనం చేసిన తర్వాత.. కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలుకుతారు.
ఖమ్మంలో భారీ ర్యాలీ ద్వారా బహిరంగ సభకు చేరుకుంటారు. పెవిలియన్ మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు సభకు అనుమతి ఉంది. సంకల్ప సభలో షర్మిల తల్లి విజయమ్మ పాల్గొంటారు. కొత్త రాజకీయ పార్టీ స్థాపన, అజెండాపై ప్రకటన చేసే అవకాశం ఉంది. షర్మిల తొలి బహిరంగ సభ కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అజెండా, దిశ, దశలపై షర్మిల స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. షర్మిల లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని భావించినా.. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సంకల్ప సభకు భారీగానే హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.