దీక్ష విరమించిన షర్మిల.. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు..!

YS Sharmila Hunger Strike. వైఎస్ ష‌ర్మిల త‌న నిరాహార దీక్ష‌ను విర‌మించారు.

By Medi Samrat  Published on  18 April 2021 3:24 PM IST
YS Sharmila Hunger strike

వైఎస్ ష‌ర్మిల త‌న నిరాహార దీక్ష‌ను విర‌మించారు. హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద నిరాహార దీక్షకు కూర్చున్న ఆమెను.. నాటకీయ పరిణామాల అనంతరం లోట‌స్‌పాండ్ వ‌ద్దకు తరలించారు. ష‌ర్మిల 72 గంట‌ల పాటు నిరాహార దీక్ష‌ను చేశారు. ఈ రోజు ఆమెతో నిరుద్యోగుల కుటుంబస‌భ్యులు దీక్ష‌ను విర‌మింప‌జేశారు.

దీక్ష విరమించిన సంద‌ర్భంగా ఆమె సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పాల‌కుల్లో ఒక్క‌రికైనా గుండె ఉందా? ఆ ఛాతీలో ఉన్న‌ది గుండెనా? బండ రాయా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం యువ‌త ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. వీరి క‌న్నీళ్ల‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు చూడాలి. నేను నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకోవాలని ష‌ర్మిల అన్నారు. నాకు మ‌ద్ద‌తు ప‌లికిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లని అన్నారు. ఈ రోజు తెలంగాణ‌లో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నారు.. ఉద్యోగాల నోటిఫికేష‌న్లు ఎప్పుడు వ‌స్తాయ‌ని ఎదురు చూస్తున్నారు. పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని షర్మిల వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చిటికేస్తే నోటిఫికేష‌న్లు వ‌స్తాయి. అప్ప‌ట్లో వైఎస్సార్ మూడు సార్లు నోటిఫికేష‌న్లు ఇచ్చారు. ఉద్యోగాలను భ‌ర్తీ చేశారు.. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారు. అప్ప‌ట్లో వైఎస్సార్ ప్రైవేటు రంగంలోనూ ల‌క్ష‌ల ఉద్యోగాలు సృష్టించారు. కేసీఆర్ మాత్రం అసమ‌ర్థుడు.. నియంత పాల‌న కొన‌సాగిస్తున్నారని ష‌ర్మిల విరుచుకుపడ్డారు. ప్ర‌శ్నించాల్సిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు చేతుల‌కు గాజులు వేసుకుని కేసీఆర్ ఇచ్చిన డ‌బ్బును తీసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారని అన్నారు. అందుకే నేను పోరాటం చేస్తాన‌ని వ‌చ్చానని ఆమె తెలిపారు.

పోలీసులు లా అండ్ ఆర్డ‌ర్ కోసం ప‌నిచేస్తున్నారా? కేసీఆర్ కోసం ప‌నిచేస్తున్నారా? అని ఆమె అన్నారు. తెలంగాణ త‌ల్లి సాక్షిగా మా బ‌ట్ట‌లు చింపి, నా చేతిని విర‌గొట్టి, ఇంకొక త‌మ్ముడి కాళ్లు విర‌గ్గొట్టి తీసుకెళ్లారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను ప‌ర్మినెంట్ చేస్తాన‌ని చెప్పారు. అవ‌న్నీ అస‌త్యాలేన‌ని ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయని ష‌ర్మిల అన్నారు. 72 గంట‌ల నిరాహార దీక్షతో పోరాటం ఆగ‌దు. మాట మీద నిల‌బ‌డ్డ‌ రాజ‌న్న బిడ్డగా చెబుతున్నా.. నేను పోరాటాన్ని కొన‌సాగిస్తూ ఉంటాను. ల‌క్షా 91 వేల ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్లు జారీ చేయాల్సిందేనని షర్మిల చెప్పుకొచ్చారు.


Next Story