కరోనా కంటే డేంజర్ వైరస్‌ కేసీఆర్: వైఎస్‌ షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  15 Jun 2023 9:58 AM GMT
YS Sharmila, YSRTP, CM KCR, BRS

కరోనా కంటే డేంజర్ వైరస్‌ కేసీఆర్: వైఎస్‌ షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణకు కేసీఆర్ శంకుస్థాన చేయడంపై విమర్శలు చేశారు. కరోనా కంటే మించిన వైరస్‌లు వస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారని.. కానీ తెలంగాణ సమాజాన్ని పట్టిపీడించే వైరస్‌ కేసీఆర్‌ కంటే మరోటి రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. బీఆర్ఎస్ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాపై కన్నేసి.. ప్రజలను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. విపరీతంగా అప్పులు చేస్తూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ బారిన పడితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని షర్మిల విమర్శించారు.

నిమ్స్‌ విస్తరణకు కొబ్బరికాయ కొట్టిన సీఎం కేసీఆర్ గత శంకుస్థాపనల సంగతేంటో చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. గతంలో రూ.15 వందల కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి కడతామని చెప్పారు..నగరం నలుమూలలా నాలుగు పెద్ద ఆస్పత్రులు కడతామని చెప్పారు. మరి ఆ ఆస్పత్రుల సంగతి ఏమైందో చెప్పాలన్నారు షర్మిల. కార్పొరేట్‌ వైద్యం ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎయిమ్స్‌ను మించిన వైద్యం కనబడటం లేదన్నారు. విలాసాల కోసం కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ.. కేసీఆర్‌కు ప్రజల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. కమీషన్ల కోసం కాళేశ్వరంపై దృష్టి పెట్టి వైద్యారోగ్య శాఖను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. శంకుస్థాపనలు తప్ప కేసీఆర్‌ పాలనలో పెద్దగా చేసిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో ఆరోగ్య తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేయలేదని షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్‌ మహమ్మారి పాలన అంతానికి ఇంజెక్షన్ సిద్ధం అయ్యిందన్నారు వైఎస్‌ షర్మిల.

Next Story