వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య: షర్మిల
పాలకుర్తి నియోజకవర్గంలోని అవుతాపూర్‌లో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య అని షర్మిల అన్నారు
By అంజి Published on 1 March 2023 5:26 PM ISTఅవుతాపూర్‌లో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
తెలంగాణలోని పాలకుర్తి నియోజకవర్గం అవుతాపూర్‌లో ఏర్పాటు చేసిన యెదుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (వైఎస్‌ఆర్) విగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఈ ఘటనపై యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లే విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇది మంత్రి ఎర్రబెల్లి, ఆయన అనుచరులు చేసిన దారుణమైన, అనాగరిక చర్య అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను తన పాదయాత్రలో ఎత్తి చూపుతున్నందుకే వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.
''అవుతాపూర్ లో మహానేత విగ్రహాన్ని కూల్చడం నీచమైన చర్య. అర్ధరాత్రి బీఆర్ఎస్ గూండాలు చేసిన పని ఇది. దయలేని దయాకర్ రావు దగ్గరుండి మరీ చేయించిన ఘాతుకం ఇది. విగ్రహాన్ని పడగొట్టిన గూండాలకు నాయకుడు ఈ ఎర్రబెల్లి. స్వయంగా మహిళలు చలిమంట వేసుకొని కట్టించిన విగ్రహంపై మొదటి నుంచే మంత్రికి కన్ను. ఆ రోజే విగ్రహ ఏర్పాటు అడ్డగించేందుకు శతకోటి ప్రయత్నాలు చేశాడు. ముందుండి నిలబడ్డ మహిళలకు పథకాలు బంద్ పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా విగ్రహం నిలిచేసరికి మంత్రికి నిద్రపట్టలేదు'' అని వైఎస్ షర్మిల అన్నారు.
ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న వైఎస్‌ఆర్ అభిమానాన్ని మంత్రి తట్టుకోలేకపోయారని అన్నారు. అర్థరాత్రి గూండాలను పెట్టి జేసీబీలతో ధ్వంసం చేయించారని ఆరోపించారు. ''ఎర్రబెల్లి ఖబడ్దార్..! నువ్వు మంత్రివా..ఖంత్రివా..!అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ములేక విగ్రహాల మీదనా నీ రాజకీయం? పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు కట్టుడు చేతకాలేదు. కనీసం డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకోలేని అసమర్థ మంత్రివి నువ్వు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉండి, బీరు బాటిళ్లు, బ్రాండి బాటిళ్లు అమ్ముకో అని చెప్పిన సన్నాసి నువ్వు.. చదువు, సంస్కారం లేని వ్యక్తిని మంత్రిని చేస్తే..
విగ్రహాలను పడగొట్టడం మీదున్న సోయి అభివృద్ధి మీద ఎక్కడుంటది? నువ్వు మంత్రివే అయితే.. నీ పేరులో దయ ఉంటే వెంటనే వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టించి నీ నిజాయతీ నిరూపించుకో.. ఒక్క విగ్రహాన్ని పడగొడితే పాలకుర్తిలో వెయ్యి విగ్రహాలు పెడతాం'' అంటూ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.