గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు..!

చదువుకుంది ఇంజనీరింగ్‌. చేస్తున్న వృత్తి మోడల్‌ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ.లక్షల ఐ ఫోన్లు.

By Kalasani Durgapraveen  Published on  19 Oct 2024 6:26 AM IST
గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యాపారం చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు..!

చదువుకుంది ఇంజనీరింగ్‌. చేస్తున్న వృత్తి మోడల్‌ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ.లక్షల ఐ ఫోన్లు. ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యవహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ పోలీసులకు పట్టుబడారు. కూకట్‌పల్లి వసంతనగర్‌ హౌజ్‌ నెంబ రు 741, రోడ్‌ నెంబ రు 21లో ఖరీదైన అద్దె భవనంలో ఇద్దరు ఇంజనీరింగ్‌ యువకులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్ టి ఎఫ్ సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతితోపాటు సిబ్బంది కలిసి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఖరీదైన అద్దె భవనంలో ఖమ్మంకు చెందిన బేగం నిలేష్‌ కుమార్‌, వరంగల్‌ డొర్నకల్‌కు చెందిన సిరాజుల్లా నివాసముంటున్నారు.

ఇంట్లో సోదాలు నిర్వహించినపుడు 1.185 కిలోల గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను విచారించగా గత కొంత కాలంగా ఇన్‌స్ట్రా గ్రామ్‌లో కాకినాడ నుంచి గంజాయిని తెప్పిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారని వెల్లడించారని సిఐ తెలిపారు. గంజాయిని కారులోను, బైకులోను తీసుకవచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. వీరివద్ద నుంచి రూ. 15 లక్షల కారు, రూ. మూడు లక్షల విలువ చేసే బైక్‌, రూ. 3 లక్షల విలువ మూడు ఐ ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.25 వేలు. పట్టుబడిన వాహనాల ఖరీదు మాత్రం రూపాయలు 20 లక్షల పైనే ఉంటుందని అంచనా వేశారు.

ఇద్దరు ఖమ్మంలోని ఇంజనీరింగ్‌ సమయములో స్నేహితులు. స్నేహితులుగా హైదారాబాద్‌ వచ్చి నివాసముంటున్నారు. నిలేష్‌ కుమార్‌ మోడల్‌ ఫోటోగ్రఫీ చేస్తు మరో పక్క గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో కానిస్టేబుళ్లు రాజేష్‌, వికాష్‌, జయచంద్ర, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌ అభినందించారు.

Next Story