యాదాద్రి లడ్డూ ప్రసాదంపై అప్రమత్తం.. హైదరాబాద్ ల్యాబ్‌కు నెయ్యి శాంపిల్స్
తెలంగాణ తిరుమల దేవస్థానంగా పేరుగాంచిన యాదాద్రి ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి నమూనాలను పరీక్ష కోసం హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపారు.
By అంజి Published on 25 Sept 2024 10:40 AM IST
యాదాద్రి లడ్డూ ప్రసాదంపై అప్రమత్తం.. హైదరాబాద్ ల్యాబ్‌కు నెయ్యి శాంపిల్స్
హైదరాబాద్: వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు వాడరాని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణ దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆరోపణల మధ్య 2022లో పునరుద్ధరించిన తెలంగాణ తిరుమల దేవస్థానంగా పేరుగాంచిన యాదాద్రి ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి నమూనాలను పరీక్ష కోసం హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 25,000 నుండి 30,000 లడ్డూలను తయారు చేయడానికి ప్రతిరోజూ 600 కిలోల నుండి 700 కిలోల నెయ్యి వినియోగిస్తారు. ఆలయంలోని నృసింహా స్వామిని దర్శించుకోవడానికి రోజు 25 వేల మంది భక్తులువస్తారు. వారాంతాల్లో 40,000 నుంచి 50,000 మంది భక్తులు వస్తారు.
ఆలయ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై భక్తుల్లో ఎలాంటి ఆందోళనలు లేవని, పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 30లోపు వెలువడుతాయని యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ భాస్కరరావు తెలిపారు గత 40 ఏళ్లుగా గేదె పాలతో తయారు చేసే నెయ్యి మదర్ డెయిరీ నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. డెయిరీ సంస్థ తన స్వంత పరీక్షల నివేదికను ఆలయానికి అందించినప్పటికీ, నెయ్యిలో ఎటువంటి అవాంఛిత కొవ్వులు కల్తీ చెందకుండా చూసేందుకు అధికారులు స్వతంత్ర పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
భాస్కరరావు మాట్లాడుతూ.. ఆలయంలో రోజూ లక్ష వరకు ప్రసాదాల లడ్డూలను తయారు చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉందన్నారు. యాదృచ్ఛికంగా, 2021లో ఆలయం పునరుద్ధరణలో ఉన్నప్పుడు, హైదరాబాద్ వాసి ఒకరు ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్‌ను కనుగొన్నారు. ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు, ప్రజల నుండి తీవ్ర స్పందనలు వచ్చాయి. ''అది ఒక వివిక్త సంఘటన. అప్పటి నుంచి యాదాద్రిలో కఠిన పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. మా ప్రసాదం ప్రతిరోజూ తాజాగా తయారు చేయబడుతుంది. తర్వాత ఉపయోగం కోసం నిల్వ చేయబడదు. దీని తయారీలో మేం అత్యున్నత నాణ్యత ప్రమాణాలను కూడా పాటిస్తున్నాం'' అని ఆలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.