ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో స్వయంభు నారసింహుడి గర్భాలయంలోకి ప్రవేశించిన ఆలయ అర్చకులు స్వామివారి అనుమతితో ఉత్సవాలను ప్రారంభించారు.
విశ్వక్సేన ఆరాధన, ఆలయ శుద్ధి పర్వాలను నిర్వహించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ చైర్మన్ నరసింహమూర్తితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 6:30 గంటలకు మృత్సం గ్రహణము, అంకురారోహణ జరుగనుంది.
పునర్ నిర్మితమైన ప్రధానాలయంలో బ్రహోత్సవాలు జరగడం ఇదే తొలిసారి. మార్చి 3 వరకు 11 రోజుల పాటు జరగబోయే ఈ ఉత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుద్దీపాలకంరణ, రంగురంగుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
బ్రహోత్సవాల్లో భాగంగా 23 నుంచి అలకారోత్సవాలు, 27 రాత్రి విశేష వేడుకలు ప్రారంభం కానున్నాయి. 28న రాత్రి తిరుకళ్యాణ మహోత్సవం, మార్చి 1న రాత్రి దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. మార్చి 3న ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల 28న రాత్రివేళ నిర్వహించే శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందజేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.