దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధివిధీనా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ కార్మికుడు గంగిపల్లి విజయ్‌కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు జీతం ఇవ్వకపోవడంతో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వేధింపులకు నిరసన తెలిపాడు. హెల్త్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ వేతనం ఇవ్వకుండా వేధిస్తున్నాడంటూ మేయర్, కమిషనర్ ఎదుట విజయ్ పెట్రోల్ పోసుకున్నాడు.
ఇతర కార్మికులు జోక్యం చేసుకుని విజయ్ కుమార్‌ను అగ్గిపుల్ల వెలిగించకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పినట్టైంది. మేయర్ బంగి అనిల్ కుమార్, ఇతర సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంకు పైన జెండా ఆవిష్కరణలో భాగంగా ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి కేలోత్ నరేష్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.