డ్రగ్స్‌ పేరెత్తాలంటేనే భయపడాలి: సీఎం రేవంత్‌

మాదక ద్రవ్యాల సరఫరా, దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

By అంజి  Published on  12 Dec 2023 8:17 AM IST
drug free Telangana, CM Revanth, TSNAB

డ్రగ్స్‌ పేరెత్తాలంటేనే భయపడాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా, దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌ఎన్‌ఏబీ) అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణను డ్రగ్​ రహిత రాష్ర్టంగా మార్చాలన్నారు. డ్రగ్స్ ​వినియోగించినా, విక్రయించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మత్తు మందుల ప్రభావం ఎక్కువగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ మహమ్మారి కనిపిస్తోందని సీఎం అన్నారు. ఇన్ఫార్మర్ల వ్యవస్థ రూపొందించుకోవాలని, డ్రగ్స్‌ పేరెత్తాలంటేనే భయపడే పరిస్థితి రావాలని అధికారులు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కొత్త డైరెక్టర్‌ను నియమిస్తామని, శాఖకు తగిన నిధులు, వనరులు, ఇతర లాజిస్టిక్‌ల సహాయాన్ని నిర్దేశిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. టీఎస్‌ఎన్‌ఏబీని గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహాలో పటిష్టం చేయాలని, ప్రత్యేక ఏజన్సీలు యాంటీ-తిరుగుబాటు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రసిద్ధి చెందాయని ఆయన అన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్‌) బీ శివధర్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి హాజరయ్యారు.

Next Story