Telangana: మహిళా దినోత్సవం 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' పోస్టర్ విడుదల

By అంజి  Published on  3 March 2023 10:55 AM IST
Women’s Day, Green India Challenge

మహిళా దినోత్సవం 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' పోస్టర్ విడుదల

హైదరాబాద్: పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత వికసిస్తుందని మహిళా దినోత్సవం 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' పోస్టర్‌ను రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గురువారం విడుదల చేశారు. 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున.. తమ పిల్లలపై చూపే ప్రేమానురాగాలతో ముందుకు సాగాలని సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు. 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ప్రత్యేక కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని ప్రకృతి పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆకాంక్షించారు.

అంతేకాకుండా, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులందరూ విరివిగా మొక్కలు నాటాలని ఆమె కోరారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ''మహిళలు మరింత శక్తివంతులు, వారు చేపట్టిన పనులను విజయవంతంగా సాధిస్తారు'' అని అన్నారు. 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి మహిళ, విద్యార్థిని పాల్గొనేలా తనవంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే భూ పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. సాలుమరాడ తిమ్మక్క స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి మహిళ మొక్కలు నాటాలని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సబర్వాల్ పిలుపునిచ్చారు. ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ మాట్లాడుతూ.. 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' కార్యక్రమం తదుపరి తరానికి ఉపయోగపడే నిస్వార్థ కార్యక్రమం అని అన్నారు.

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'లో ప్రతి మహిళ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మద్దతుగా ఎంపీ సంతోష్‌కుమార్‌ 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఇనీషియేటివ్‌' కింద కొండగట్టులోని కొడిమ్యాల అటవీ ప్రాంతంలోని 1,000 ఎకరాలకు పైగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 17న సీఎం కే చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు నేపథ్యంలో దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ ప్రకటించారు.

దట్టమైన అడవులు, పర్వతాల మధ్య ఉన్న ప్రసిద్ధ కొండగట్టు ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు హనుమంతునికి పర్యాయపదం. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఆయన తపనను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు.

Next Story