పెద్ద బ‌తుక‌మ్మ‌ను స‌ద్దుల బ‌తుక‌మ్మ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

Why is Padda Bathukamma called Saddula Bathukamma?. బతుకమ్మ పండుగ చివరి రోజు రానే వచ్చింది. ఆశ్వయుజ అష్టమి తిథిన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. దీనినే దుర్గాష్టమి అని

By అంజి  Published on  3 Oct 2022 3:46 AM GMT
పెద్ద బ‌తుక‌మ్మ‌ను స‌ద్దుల బ‌తుక‌మ్మ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

బతుకమ్మ పండుగ చివరి రోజు రానే వచ్చింది. ఆశ్వయుజ అష్టమి తిథిన సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. దీనినే దుర్గాష్టమి అని కూడా అంటారు. ఆశ్వయుజ అష్టమి (దుర్గా అష్టమి) నాడు - బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున బతుకమ్మను ఎనిమిది రోజుల కంటే పెద్ద పరిమాణంలో వివిధ పూలతో తయారు చేస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు - ఈ రోజున 5 రకాల అన్నం, ఒక తీపిని సమర్పిస్తారు. అమ్మవారికి ఆహార నైవేద్యాలు- పెరుగన్నం సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, చింతపండు పులిహోర సద్ది - చింతపండు, కొబ్బరి అన్నం సద్ది, నువ్వుల అన్నం సద్ది, మళ్లీద.

దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి దుర్గమాతగా.. కొలువుదీరిన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. రాక్షసుడిని చంపి అలసిపోయిన అమ్మవారికి ఘనమైన పాకాలు నైవేద్యాలుగా పెడుతారు భక్తులు. సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన సద్దులు చేస్తారు. అందుకే చివరి రోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు.

మిగతా రోజులకన్నా భిన్నంగా ఇవాళ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. సాయంత్రం కాగానే ఊరు వాడా అంతా కలిసి చెరువు గట్టు వద్దకు వెళ్తారు. మహిళలు బతుకమ్మలను అక్కడ పెట్టి ఆట పాటలతో ఉత్సవాలు జరుపుకుంటారు. ఇది చూసేందుకు పురుషులు కూడా ఉత్సాహం కనబరుస్తారు. ఆట పాటల తర్వాత బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేసి.. తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. దుర్గాష్టమి తర్వాత రెండవ రోజు, అంటే ఆశ్వయుజ దశమి (ఆశ్వయుజ మాసంలో పదవ రోజు) నాడు దసరా జరుపుకుంటారు, దీనిని విజయ దశమి అంటారు.

Next Story
Share it