తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్కంఠ, ఢిల్లీకి భట్టి, ఉత్తమ్‌

తెలంగాణ సీఎం ఎంపికపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  5 Dec 2023 4:50 AM GMT
telangana cm, suspense, congress, kharge,

 తెలంగాణ సీఎం ఎంపికపై ఉత్కంఠ, ఢిల్లీకి భట్టి, ఉత్తమ్‌ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. అయితే.. కాంగ్రెస్‌ సీఎం ఎంపికపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఏఐసీసీ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేల నుంచి సీఎం అభ్యర్థి ఎంపికపై ఆయన అభిప్రాయాలు సేకరించారు. చాలా వరకు రేవంత్‌రెడ్డిని సీఎం చేయాలని అభిప్రాయం తెలిపినట్లు తెలుస్తోంది. మరికొందరు సీనియర్‌ నేతలు మాత్రం భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే.. మొత్తం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం మేరకే నడుచుకుంటామని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చెప్పారని డీకే శివకుమార్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు ఇతర నేతలు సోమవారమే ఢిల్లీకి వెళ్లారు. దాంతో.. తెలంగాణ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్‌, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గేతో సమావేవం కానున్నారు. మధ్యాహ్నం ఆయనతో సమావేశం అయ్యి తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. ఆయన నిర్ణయం మేరకే తెలంగాణ సీఎంను ఎంపిక చేస్తారు.

మరోవైపు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. వీరిద్దరు కూడా ఖర్గేతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు కూడా సీఎం పదవి గురించే ఖర్గేతో చర్చించనున్నారనీ తెలుస్తోంది. మరి ఖర్గే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం రాత్రే సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. దానికి ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరకు సీఎం ఎంపికపై సస్పెన్స్ ఏర్పడటంతో ఆ కార్యక్రమం కాస్త వాయిదా పడింది. ఖర్గేతో డీకే శికుమార్‌, ఠాక్రే భేటీ తర్వాత సీఎం ఎంపికపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

Next Story