'ఆ 2 లక్షల ఉద్యోగాలేవి?'.. రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగిన కవిత

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటు...

By -  అంజి
Published on : 2 March 2026 12:37 PM IST

Rahul Gandhi Telangana Visit, 2 Lakh Jobs Promise, Youth Declaration Bogus, Unemployment Issues in Telangana, Job Calendar Telangana, Kalvakuntla Kavitha Questions Rahul Gandhi

'ఆ 2 లక్షల ఉద్యోగాలేవి?'.. రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగిన కవిత

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు సంధించారు. 'దో లాక్ నౌకరీ దో' (రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి) అంటూ రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆమె మండిపడ్డారు.

డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీకి కవిత పలు ప్రశ్నలు సంధించారు. "కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి ఇప్పటికి రెండున్నరేళ్లు కావస్తోంది. మీ మాట నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు నేడు ఉద్యోగాలు లేక శిక్ష అనుభవిస్తున్నారు. వారి గోడు మీకు వినిపించడం లేదా?" అని ఆమె నిలదీశారు.

కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ పచ్చి అబద్ధమని కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువత నిచ్చెనమెట్లుగా నిలిచారని, కానీ గద్దెనెక్కిన తర్వాత వారి ఆశలను, ఆకాంక్షలను ప్రభుత్వం చిదిమేసిందని ఆరోపించారు. నిరుద్యోగులు తమకు రావలసిన ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే, ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి వారి గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదని, అసలు దాని ఆచూకీ కూడా లేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ సమాజంలో 'కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన' అనే అభిప్రాయం బలపడిందని కవిత వ్యాఖ్యానించారు. "రాహుల్ జీ.. ఇది పోరాటాల పురిటిగడ్డ. ఇక్కడ మాట ఇచ్చి తప్పితే ప్రజలు క్షమించరు. మీ హామీని వెంటనే నిలబెట్టుకోండి. తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి" అని ఆమె డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పర్యటన వేళ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story