హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్రాడ్‌కు.. జి వివేకానంద్‌కు సంబంధం ఏమిటి..?

మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను జరిపినట్లు గుర్తించామని తెలిపారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2023 5:35 AM GMT
Congress candidate, G Vivekanand , Hyderabad Cricket Association Fraud, Raids

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫ్రాడ్‌కు.. జి వివేకానంద్‌కు సంబంధం ఏమిటి..?

మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను జరిపినట్లు గుర్తించామని తెలిపారు. భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని.. ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విజిలెన్స్ సెక్యూరిటీ ద్వారా ఎలాంటి వ్యాపారం లేకపోయినా పెద్దయెత్తున లావాదేవీలు జరిగాయని అధికారులు చెప్పారు. నకిలీ పత్రాలతో ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్/వైస్ ప్రెసిడెంట్/సెక్రటరీగా పనిచేసిన గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌ల ఇళ్లపై దాడులు నిర్వహించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నిర్మించిన రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజీ సెట్లు, అగ్నిమాపక వ్యవస్థల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. నవంబర్ 21న, ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం తెలంగాణలోని తొమ్మిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.

ఎస్ఎస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయ ప్రాంగణంలోనూ.. ఆ సంస్థ ఎండీ సత్యనారాయణ నివాస ప్రాంగణంలో కూడా సోదాలు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్ లో వివిధ డిజిటల్ పరికరాల రికవరీ చేశారు. లెక్కలో చూపని రూ. 10.39 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్/వైస్ ప్రెసిడెంట్/సెక్రటరీగా పనిచేసిన గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఎలా మోసం చేశారు? మరి కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి జి వివేకానందకు ఈ మోసంలో ఎలాంటి లింక్స్ ఉన్నాయి?

మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి జి.వివేకానంద్ సోదరుడు. గడ్డం వినోద్‌కు చెందిన ఒక ప్రాంగణంలో వెతికితే.. గడ్డం వివేకానంద్ యాజమాన్యంలోని అనేక కంపెనీలకు సంబంధించిన కార్యాలయంగా ఉపయోగిస్తూ ఉన్నారని తేలింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నిర్మించిన రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజీ సెట్లు, అగ్నిమాపక వ్యవస్థలు, కనోపీ కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. ఛార్జిషీట్‌ల ప్రకారం అనేక పనులను ఎంతో ఆలస్యం చేశారు. దీంతో ఖర్చులు పెరిగిపోయాయి.. బడ్జెట్ కూడా పెరిగిపోవడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు నష్టాలు వచ్చాయి.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అప్పటి సెక్రటరీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తదితరులతో సహా ఆఫీస్ బేరర్లు ప్రైవేట్ పార్టీలతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వివిధ టెండర్లు దక్కించుకున్నారు. మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరకు పనులు కేటాయించినట్లు స్పష్టమైంది. సరైన టెండర్ ప్రక్రియలను అనుసరించలేదు.. చాలా మంది కాంట్రాక్టర్లకు ముందస్తుగా చెల్లింపులు జరిగినా కూడా కావాలనే పనులను ఆలస్యం చేశారు. అనుకున్న సమయానికి పనులు జరగలేదు.

పలు ప్రాంగణాల్లో సోదాలు జరపగా.. విశాఖ ఇండస్ట్రీస్, ఆ గ్రూప్ కు చెందిన కంపెనీలు తమ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు సంబంధించి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు, చెల్లింపులను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాయనేదానికి తగిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్వాధీనం చేసుకున్న పత్రాలలో వివిధ వ్యక్తుల నుండి నగదు స్వీకరించడం, రియల్ ఎస్టేట్ కంపెనీల పుస్తకాలలో ఇతర లావాదేవీలను ఆమోదించడం వంటి అనేక విషయాలను గుర్తించారు.

Next Story