ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం తండాలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. తన కూతురిని అత్తగారి ఇంటికి సాగనంపుతుండగా వధువు తల్లి గుండెపోటుతో కుప్పకూలి మరణించింది. స్థానికుల కథనం ప్రకారం.. బానోత్ మోహన్ లాల్, కళ్యాణి దంపతులు ఆదివారం కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన వరుడితో తమ కుమార్తె సింధు వివాహాన్ని జరిపించారు.
సాయంత్రం సమయంలో అత్తగారింటికి వధువును పంపుతున్న వేళ.. వధువు తల్లి కళ్యాణి (38) అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆనందకరమైన సందర్భం త్వరలోనే దుఃఖంగా మారింది, అబ్బాసుపురంలో విషాదం అలుముకుంది. వేడుకల కోసం గుమిగూడిన కుటుంబం సోమవారం కళ్యాణి అంత్యక్రియలు నిర్వహించింది.