తెలంగాణలో యూనివర్సిటీల జాయింట్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఒక వేళ లేఖ వస్తే తప్పకుండా స్పందిస్తానన్నారు. గవర్నర్ లేఖ రాయకుండానే.. రాసినట్లు చెప్పడం సరికాదని మంత్రి సబిత అన్నారు. జాయింట్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ అభ్యంతరాలు లేవనెత్తినట్లు, వాటిపై చర్చించడానికి రాజ్‌భవన్ రావాలని విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది.
దీనిపై స్పందించిన మంత్రి సబిత.. బిల్లును పంపిన వెంటనే అభ్యంతరాలు చెబితే వాటిని పరిష్కరించేవారమని, బిల్లు పంపించిన 54 రోజుల తర్వాత ఇప్పుడు సమాచారం అడగడం భావ్యం కాదన్నారు. యూనివర్సిటీల డెవలప్‌మెంట్, స్టూడెంట్స్‌కు లబ్ది, నిరుద్యోగులకు మేలు కోసం రాష్ట్ర సర్కార్ ఈ బిల్లు తెచ్చిందని మంత్రి సబిత అన్నారు. గవర్నర్ తమిళిసై బిల్లు పెండింగ్‌లో పెట్టిందని, దీని వల్ల ఉద్యోగ నియమాకాల్లో ఆలస్యం జరుగుతోందన్నారు. వెంటనే రిక్రూట్‌మెంట్ చేపట్టాలని నిరుద్యోగులు, విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు.
అయితే ఈ విషయమై రాజ్‌భవన్ స్పష్టతనిచ్చింది. ప్రభుత్వ వివరణ కోసం సీఎం కార్యాలయానికి లేఖ రాశారని.. అందులో విద్యశాఖ మంత్రి రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని సూచించినట్లు పేర్కొన్నాయి.