వరంగల్ అర్బన్ జిల్లా పేరు మార్పు.. ఇక నుంచి హన్మకొండ జిల్లాగా
Warangal Urban District to be changed as Hanmakonda District.వరంగల్ అర్భన్, రూరల్ జిల్లాల పేర్లను
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2021 5:12 PM ISTవరంగల్ అర్భన్, రూరల్ జిల్లాల పేర్లను మార్చుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్‌లో నూతనంగా నిర్మించిన వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ అర్భన్, రూరల్ జిల్లాల పేర్లను మార్చుతున్నట్లు ప్రకటించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్‌గా మార్చుతామని సీఎం తెలిపారు. పేరు మార్పునకు సంబంధించిన ఉత్తర్వులు మరో రెండు, మూడు రానున్నాయని పేర్కొన్నారు. ఈరోజు ప్రారంభించుకున్న కలెక్టరేట్ భవనాన్ని హన్మకొండ జిల్లాగా పరిగణించాలని.. దీనికి సమీపంలో నిర్మించబోయే కలెక్టరేట్‌ను వరంగల్ కలెక్టరేట్‌గా పరిగణించాలని సూచించారు.
రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పనులు ఆలస్యం కాకుండా వేగంగా జరగాలన్నారు. వరంగల్‌కు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నామని చెప్పారు. త్వరలో వరంగల్‌కు కొత్త కలెక్టరేట్ రానున్నట్టు తెలిపారు. బ్రిటిష్ కాలంలో కలెక్టర్ అని పేరు పెట్టారని, బ్రిటీష్ కాలంలో పెట్టిన పేరు కూడా మారాలని కేసీఆర్ అన్నారు. కొత్త కలెక్టరేట్ ను ఇంకా ఆధునతనంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ధరణి పోర్టల్ తో భూ సమస్యలు తీరాయని చెప్పారు. వరంగల్ పరిశ్రమల కేంద్రం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం అంటే ప్రజలకు ఇబ్బంది కలగనప్పుడే నిజమైన పరిపాలన అని అన్నారు.
6.73 ఎకరాల స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టగా.. రూ.57 కోట్లతో అధునాతన సాంకేతికతతో కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఒకే చోట 34 శాఖల కార్యాలయాలు ఉంటాయి.