తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, పనులకు వెళ్లేవారు ఉదయమే ఓటు వేసేందుకు బారులు తీరారు. ఓటర్ స్లిప్‌తో పాటు ఏదైన గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేసేందుకు సిబ్బంది లోనికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం నేడు తేలనుంది.
సెల్పీలు దిగొద్దు..
పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్‌ఫోన్లు నిషేదమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.