ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జ్ సీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. అదే విధంగా సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్‌సింహా, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్‌కు కూడా నాంపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది. అక్టోబర్4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా.. ఓటుకు నోటు కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. కేసులు, అరెస్ట్‌ల పర్వం కూడా కొనసాగింది. ఇప్పుడు ఈడీ చార్జీషీట్‌తో మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది.
కాగా.. ఇటీవలే ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయమన్న రేవంత్ రెడ్డి వాదనలతో ఏకీభవించింది. గతంలో ఇదే అంశంపై ఏసీబీ విచారణకు హైకోర్టు ఇచ్చిన అనుమతిపై స్టే విధించింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఓటు వేయాలని కోరేందుకు రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లగా.. డబ్బులు ఇచ్చారు అనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు.