గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పోలింగ్ తగ్గింది: వికాస్ రాజ్

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు కౌంటింగ్ పైనే అందరి చూపు ఉంది.

By Srikanth Gundamalla  Published on  1 Dec 2023 9:47 AM GMT
vikas raj, telangana, election commissioner,

గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతం పోలింగ్ తగ్గింది: వికాస్ రాజ్ 

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు కౌంటింగ్ పైనే అందరి చూపు ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్‌ 3న జరగనుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ క్రమంలో వికాస్‌ రాజ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 70.74 నమోదు అయ్యిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందనీ అన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారనీ చెప్పారు. 78 నుంచి 19 ఏళ్ల మధ్యవయసు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నారని తెలిపారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా 80వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ వినియోగించుకున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు.

కాగా.. భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.3 శాతం పోలింగ్‌ నమోదు అయ్యిందన్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు చెప్పారు. 2018లో పోలింగ్ 73.37 శాతం నమోదు కాగా.. ఇప్పుడు మూడు శాతం పోలింగ్ తగ్గిందని చెప్పారు. తెలంగాణలో మొత్తం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందనీ.. ఎక్కడా అవకతకవలు జరగలేదన్నారు. కాబట్టి రీపోలింగ్‌కు ఎక్కడా అవకాశమే లేదని చెప్పారు వికాస్‌రాజ్. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. యాకత్‌ పురా నియోజవకర్గంలో 39.6 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 80 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించామనీ.. ఎల్లుడి 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని వికాస్‌ రాజ్ తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు విధుల్లో ఉంటారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ప్రతి రౌండ్‌కు సమయం పడుతుందనీ.. అంతా ఈసీఐ నిబంధనల ప్రకారమే జరుగుతుందని వికాస్‌రాజ్ చెప్పారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతందన్నారు. అరగంట సేపు ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు. ప్రతీ టేబుల్‌కు ఐదుగురు చొప్పున కౌంటింగ్ జరుగుతుందని వికాస్‌ రాజ్ వెల్లడించారు.

Next Story