వికారాబాద్‌లో విషాదం.. తండ్రి కళ్ల ముందే కొడుకు మృతి

వికారాబాద్‌ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది

By Srikanth Gundamalla  Published on  6 July 2024 12:26 PM IST
vikarabad, accident, 9 years child, dead ,

వికారాబాద్‌లో విషాదం.. తండ్రి కళ్ల ముందే కొడుకు మృతి 

వికారాబాద్‌ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. లారీ ఢీకొని తండ్రి కళ్ల ముందే.. తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

తాండూర్ మండలం గౌతపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. జనార్దన్ అనే వ్యక్తి గౌతపూర్ గ్రామ పరిధిలో ఓ పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్నాడు. తండ్రి జనార్ధన్ తన ఇద్దరు పిల్లలను తీసుకొని బైక్ మీద వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ రోడ్డుపక్కకు నిలిచి ఉన్న లారీ వెనుక ఆగారు. అయితే ఆ విషయం తెలియని లారీ డ్రైవర్ వాహనాన్ని వెనుకకు పోనిచ్చాడు. చూస్తూ ఉండగానే లారీ రివర్స్‌లో వచ్చి బైక్‌ను డీకొట్టింది. బైక్ పైన నుంచి వెళ్లింది. బైక్ పై ఉన్న తండ్రి, కూతురు కింద పడ్డారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని లేచి పక్కకు వెళ్లారు. కానీ 9 సంవత్సరాల బాలుడు లారీ కింద నలిగి పోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. అక్కడి కక్కడే మృతి చెందాడు. తండ్రి అరుస్తున్నా లారీ అలాగే వెనక్కి వచ్చింది. కళ్ల ముందే కన్న కొడుకుని పోగొట్టుకోవడంతో తండ్రి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు.

కాగా.. ఇదే సంఘటనలో తండ్రి, కూతురుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయాలైన తండ్రి, కూతురు లను తాండూర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతదేహన్ని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత కరణ్ కోట్ పోలీసులు లారీ డ్రైవర్ను అదుపు లోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు. ఇద్దరు పిల్లలను స్కూలుకు తీసుకెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Next Story