వ్యాక్సీన్ డోసుల నిల్వ ఉన్నా.. వాక్సినేషన్ ఆపేశారు

Vijayashanti Fires On Telangana Govt.రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సీన్ డోసుల నిల్వ ఉన్నా గత 3 రోజుల నుంచీ వాక్సినేషన్ ఆపేశారని విజ‌య‌శాంతి ఫైర్ అయ్యారు.

By Medi Samrat  Published on  17 May 2021 9:08 PM IST
Vijayashanti

కరోనా కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు.. రెమ్డెసివీర్‌ ఇంజెక్షన్లను 10 వేలకు పెంచినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి. రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై సర్కారు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనాకు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పరిస్థితిపై.. హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పాలకులు చురుకుగా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అవాంఛనీయ పరిణామాలపై గతంలోనే సత్వర చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదని విజ‌య‌శాంతి అన్నారు. రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సీన్ డోసుల నిల్వ ఉన్నా గత 3 రోజుల నుంచీ వాక్సినేషన్ ఆపేశారని ఆమె ఫైర్ అయ్యారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని.. ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదని.. కరోనా కట్టడిపై తెలంగాణ సర్కారు తీరును ఎండ‌గ‌ట్టారు.

ఇక‌ మల్లాపూర్‌కు చెందిన ఒక గర్భిణిని చేర్చుకోవడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించి ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టిన వైనం అత్యంత వేదన కలిగిస్తోందని ఆమె అన్నారు. ఎందరో బాధితులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తక్షణం దృష్టి సారించాలని కోరారు. ఇక‌ తెలంగాణ రైతులు మరోసారి కడగండ్ల పాలు కావడం బాధ కలిగిస్తోందని.. ధాన్యం కొనుగోళ్ళలో తెలంగాణ సర్కారు ఉదాసీనతతో వ‌డ్లు వర్షం పాలై రైతులు మరోసారి నష్టపోయారని అన్నారు. కేసీఆర్ సర్కారుకు ఎటు చూసినా వైఫల్యాలే తప్ప.. పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ఒక ప్రణాళిక కనిపించడం లేదని విజ‌య‌శాంతి అన్నారు.


Next Story