తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని.. పగటి పూట నియంత్రణలేమీ లేవని అన్నారు. ఓ వైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్పల్ప కాల లాక్‌డౌన్ విధించాయని.. మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి లాక్ డౌన్ వల్ల ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిని ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని, ధాన్యం సేకరణ కూడా తీవ్రంగా గాడి తప్పుతుందని సీఎం కేసీఆర్ సెలవిచ్చారని ఆమె ఫైర్ అయ్యారు.
అయితే, గతంలో సరి, బేసి సంఖ్యలో దుకాణాలు తెరవడానికి అవకాశమివ్వడం.. కోవిడ్ నియంత్రణకు పరిమితుల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, ఉద్యోగ, కార్మిక కార్యకలాపాలు నడిచేలా పాస్‌లు జారీ చేయడం.. వంటి చర్యలతో పరిస్థితిని కొంత అదుపు చేసిన సంగతి గుర్తు లేదా? ప‌్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా చికిత్స తీరు, టెస్టుల నిర్వహణ, బెడ్లు, మందులు, వాక్సీన్ అందుబాటుపై దాదాపు రోజూ అధికారులకు కోర్టు మందలింపులు, మీడియా కథనాలు వాస్తవాల్ని చూపిస్తుంటే.. సీఎస్, సీఎం మాత్రం అంతా బాగుందన్నట్టు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక రోజు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెబుతారు.. మరొక రోజు కేంద్రంపై నిందలేస్తూ విమర్శలు చేస్తారు. పరిస్థితిని కట్టడి చెయ్యలేని ఈ తెలంగాణ పాలకుల తీరుపై ఏం చెయ్యాలో తెలియక జనం తల పట్టుకుని కూర్చున్నారని ప్రభుత్వ తీరును విజయశాంతి ఎద్దేవా చేశారు.