అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. సచివాలయంలో సీఎస్ కార్యాలయంలో ఈ మేరకు వీహెచ్‌పీ నేతలు వినతిపత్రం అందించారు. రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం హిందువులకు సరికొత్త పండుగ దినమని.. అందరూ పండుగ వాతావరణంలో గడిపేందుకు రేపు సెలవు ఇవ్వాలని కోరారు. అటు బీజేపీ బండి సంజయ్ సహా పలువురు కూడా రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
''హిందువులందరూ దాదాపు 500 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి కూడా స్వామీజీలకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు ఆహ్వానం అందింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొననున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. తద్వారా ప్రజలందరూ బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశాన్ని కలిగించగలరు. అదే విధంగా ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజలు, ప్రసాద వితరణ, సాయంత్రం దీపారాధన చేయించగలరని మనవి చేస్తున్నాము'' అంటూ వినతి పత్రంలోవీహెచ్‌పీ పేర్కొంది.