కాలుష్య నివారణకు సరికొత్త విధానం

Vehicle pollution Checking New approach.. వాహన కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో

By సుభాష్  Published on  17 Nov 2020 4:30 AM GMT
కాలుష్య నివారణకు సరికొత్త విధానం

వాహన కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ సరికొత్త విధానాన్ని రూపొందించింది. మొదటిసారిగా ఆన్‌లైన్‌లోనే వాహనాల కాలుష్యాన్ని తనిఖీ చేసి వివరాలు తెలిపేలా సాఫ్ట్‌ వేర్‌ను రూపొందించి వెహికులర్‌ పొల్యూషన్ మనేజ్‌మెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో రోజురోజుకు వాయు కాలుష్య తీవ్రత పెరిగి ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఎన్ని వాహనాలకు కాలుష్య తనిఖీ చేయించారనే విషయం తెలిసేది కాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే వాహనాల కాలుష్యాన్ని తనిఖీ వివరాలు పొందుపరిచేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 22 పీయూసీ కేంద్రాలు ఉండగా, 1631 వాహనాలకు కాలుష్య తనిఖీలు నిర్వహించి సర్టిఫికేట్‌ జారీ చేశారు.

కాగా, రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న వాయు కాలుష్యం తీవ్రత ప్రతి వాహనదారుడికి తెలిసేలా రవాణా శాఖ తన వెబ్‌సైట్లో ప్రత్యేకంగా ఓ లింక్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య తీవ్రత, కాలుష కారక మూలాలు, వాటి ప్రభావం తదితర అంశాలు పొందుపరుస్తున్నారు. ముఖ్యంగా కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, లెడ్‌ లాంటి కాలుష్య కారకాలతో కలిగే అనర్థాలను వివరించేలా ఈ సాఫ్ట్‌ వేర్ను ఏర్పాటు చేశారు.

Next Story