ఖమ్మం : ఖమ్మం జిల్లాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఫిబ్రవరి 3 శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రైలు వెలుతుండగా ఖమ్మం స్టేషన్ సమీపంలోని రైలుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సీ12 కోచ్ అద్దాలు పగిలిపోయాయి.
రైలు విశాఖపట్నం చేరుకున్న అనంతరం పగిలిన అద్దాలను మార్చారు. దీంతో ఫిబ్రవరి 4న శనివారం రైలు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
కాగా.. జనవరి 11న ఇదే విధమైన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ట్రయల్ రన్ కోసం చైన్నై నుంచి రైలును విశాఖపట్నం తీసుకురాగా కోచింగ్ కాంప్లెక్స్‌కు తీసుకువెలుతుండగా కంచరపాలెం వద్ద గుర్తు తెలియని దుండుగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా రైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ రైలు వైజాగ్ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. రైలు సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 11.25 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.