సికింద్రాబాద్‌ నుంచి పరుగులు పెట్టనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.!

Vande Bharat Express train sanctioned for South Central Railway. త్వరలోనే సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు పెట్టనుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే

By అంజి  Published on  4 Dec 2022 9:38 AM IST
సికింద్రాబాద్‌ నుంచి పరుగులు పెట్టనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.!

త్వరలోనే సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులు పెట్టనుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఐదు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పలు ప్రధాన నగరాలను కలుపుతూ పరుగులు పెడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు అత్యాధునిక సౌకర్యాలు ఉన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ మంజూరైంది. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌కు శుక్రవారం అధికారిక సమాచారం అందింది. ఎస్‌సీఆర్‌కు మంజూరైనది ఆరోది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడుస్తుంది. బయలుదేరిన రెండు నిమిషాల్లోనే 160 కి.మీ వేగాన్ని అందుకునే సామర్థ్యం ఈ రైలుకు ఉంది.

కాగా సికింద్రాబాద్ - విజయవాడ మధ్య కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు ఉండగా, సికింద్రాబాద్-గుంటూరు వయా నల్గొండ మార్గంలో గరిష్ట వేగం గంటకు 110 కిలోమీటర్లుగా ఉంది. వందే భారత్ కోసం ప్రస్తుత ట్రాక్ సామర్థ్యం 180 కిలోమీటర్ల గరిష్ట వేగానికి పెంచాల్సి ఉంటుంది. ఈ నెలలోనే ఈ కొత్త రైలును ప్రారంభించేందుకు రైల్వే డిపార్ట్‌మెంట్‌ ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇటీవల సికింద్రాబాద్ నుంచి ఏపీలోని తిరుపతి, విశాఖపట్నంలకు వందేభారత్ రైళ్లు కావాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభ్యర్థించారు.

ఎట్టకేలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ ఫలించింది. ప్రస్తుతం వందేభారత్‌లో సీట్లు మాత్రమే ఉన్నందున ముందుగా విజయవాడ వరకు నిర్వహిస్తామని కిషన్‌రెడ్డికి అశ్వినీవైష్ణవ్ తెలిపారు. బెర్తులతో కూడిన వందే భారత్‌ రైళ్లు వచ్చాక వైజాగ్‌ వరకు పొడిగిస్తామని రైల్వేమంత్రి తెలిపారు. ఇక ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిగ్నలింగ్‌, ట్రాక్‌ అప్‌డేట్‌, ఇతర రైళ్ల టైమ్‌ టేబుల్‌ సర్దుబాటు కాగానే.. ఈ రైలు ప్రారంభ తేదీపై క్లారిటీ వస్తుంది.

Next Story