కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు టీఆర్ఎస్ నేత వనమా రాఘవను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వనమా రాఘవను సస్సెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌చార్జ్ నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని వారు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమా రాఘవ నిందితుడిగా ఉన్నారు. వనమా రాఘవ పెట్టిన ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్పీ వీడియోలో చెప్పారు. ఈ సెల్పీ వీడియో గురువారం బయటకు వచ్చింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని రామకృష్ణ ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారన్నాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని తెలిపాడు. తాను చనిపోతే తన భార్య, పిల్లలను వదిలిపెట్టరని అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ వీడియోలో రామకృష్ణ తెలిపారు. దీంతో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి రాఘవను సస్సెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది.