సంగారెడ్డి జిల్లాలోని శిశుగృహంలో ఉన్న నాలుగేళ్ల బాలికను వర్జీనియాకు చెందిన అమెరికా యువ జంట దత్తత తీసుకున్నారు. బాలికను వృత్తిరీత్యా నర్సు అయిన బ్రియాన్ లీ డాట్సన్ (35), అతని భార్య ఎమిలీ ఎలిజబెత్ రెడ్డెన్ (29)లకు ఇచ్చారు. అమెరికా వరల్డ్ అడాప్షన్ అనే అమెరికన్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా.. ఈ జంట తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖను సంప్రదించారు. బాలికకు మైస్తీనియా గ్రావిస్ అనే నాడీ కండరాల వ్యాధి ఉంది, ఇది ఎముకల, కండరాల బలహీనతకు కారణమవుతుంది.
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ దంపతులకు బాలిక మూడో సంతానంగా జన్మించింది. అయితే ఆ శిశువును తండ్రి అమ్మకానికి పెట్టాడు. కొన్నవారు ఆ శిశువులో ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించి శిశువును తండ్రికి అప్పగించారు. ఆ తర్వాత తండ్రి.. శిశుగృహకు బాలికను అప్పగించారు. బాలిక గుండెకు రంధ్రం కూడా ఉంది. అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలికకు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత బాలిక మైస్తీనియా వ్యాధికి గురైంది. సాధారణంగా ఇలాంటి రుగ్మత ఉన్నవారిని దత్తత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రారు.
ఈ క్రమంలోనే బాలల పరిరక్షణ కమిటీ.. చిన్నారిని ప్రత్యేక అవసరాలున్న జాబితాలో చేర్చింది. ఐదు నెలల కిందట ఈ విషయం తెలుసుకున్న అమెరికాలోని వర్జీనియాకు చెందిన దంపతులు చిన్నారిని అడాప్ట్ చేసుకునేందుకు ముందుకు వచ్చారు. కలెక్టర్ శరత్ చేతుల మీదుగా బాలికను అమెరికా దంపతులకు అప్పగించారు. దత్తత ఇచ్చినా.. చిన్నారి బాగోగులను ఎప్పటికప్పుడ తెలుసుకుంటూనే ఉంటామని అధికారులు తెలిపారు. ఇక ఇన్ని రోజులు తమతో ఉన్న చిన్నారి వెళ్లిపోతుంటే శిశృగృహంలోని సిబ్బంది ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.