'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర' కేసులో బీజేపీ నేతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తూ సీఎం కేసీఆర్ వీడియోలు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేసీఆర్ సర్కార్‌ను కూలగొట్టే విధంగా వీడియో ఎక్కడా లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? ప్రశ్నించారు.
కేసీఆర్ ఊహాల్లో నుంచి పుట్టిందే ఈ కథ అని సెటైర్ వేశారు. స్వామీజీలతో ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతాయా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిరెడ్డి నీతిమంతుడైనట్లు చెబుతున్నారని, తెలంగాణ రత్నాలని చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారు? అంటూ ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ తన పాత రికార్డులనే మళ్లీ తిరగతోడారని అన్నారు. తనకి తానే సీఎం పదవిని తక్కువ చేస్తూ మాట్లాడారన్నారు. తన అసహనం, ఆక్రోశం, అభద్రతా భావాన్ని మరోసారి మీడియా ముందు ఉంచారని కిషన్‌రెడ్డి అన్నారు.
బ్రోకర్ల ద్వారా నాయకులను పార్టీలో జాయిన్ చేసుకునే అలవాటు తమకు లేదని అన్నారు. తెలంగాణకు సంబంధించి ఏ విషయమైనా బీజేపీ అధిష్ఠానం తమతో సంప్రదిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని తమకు లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కేటీఆర్ వచ్చినా తమ పార్టీలో చేర్చుకోబోమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే తాము అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి అన్నారు.