ఏ ప్రాతిపదికన కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నారో చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. భైంసా ఘటనలు, ఫిర్యాదులపై పూర్తి నివేదిక అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారని పేర్కొన్నారు.
గత ఏడేళ్లుగా వర్సిటీల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రొఫెసర్లు లేక వర్సిటీలు మూతపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు మరిచి కేంద్రంపై విమర్శలు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోబోమని హెచ్చరించారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం టి.ఆర్.ఎస్ కి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పూర్తిస్థాయిలో ఆట మొదలుపెడితే టి.ఆర్.ఎస్ కి దిమ్మతిరిగిపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి అమిత్ షా భైంసా ఘటనపై ఆరా తీశారని కిషన్ రెడ్డి తెలిపారు.
బైంసాలో పథకం ప్రకారం మజ్లిస్ పార్టీ నాయకత్వంలో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. టి.ఆర్.ఎస్ సాయంతోనే మజ్లిస్ భయానక పరిస్థితులు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మత కలహాలు జరిగినపుడు భైంసాలో పర్యటించి భవిష్యత్తులో ఈ ఘటనలు జరగకూడదని పోలీసులకు సూచించామని, కానీ పరిస్థితుల్లో మార్పు లేదని ఆవేదన చెందారు. టి.ఆర్.ఎస్ ప్రభుత్వ అండతో కలహాలకు కారకులైన మజ్లిస్ నేతలను వదిలేస్తున్నారని పోలీసులపై ధ్వజమెత్తారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పోలీసుల చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఉందని ఆక్షేపించారు.