సైబరాబాద్‌ పరిధిలో ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మరో ఇద్దరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది.

By Srikanth Gundamalla  Published on  28 Dec 2023 2:54 PM IST
police, suspended,  cyberabad,

 సైబరాబాద్‌ పరిధిలో ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు 

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మరో ఇద్దరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు చట్టాన్ని చేతులోకి తీసుకుని వ్యవహరిస్తారు. తాము చేసిందే న్యాయం అన్నట్లుగా మాట్లాడుతారు. అంతేకాదు.. స్టేషన్‌కు వచ్చినవారిపై చేయి కూడా చేసుకుంటారు. ఇలా వ్యవహరించిన పోలీసులపై సైబరాబాద్‌ సీపీ కొరడా ఝుళిపిస్తున్నారు. విధినిర్వహణలో అవినీతి ఆరోపణలతో పాటు ఇతర అంశాలపై సీపీ అవినాశ్‌ మహంతి దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఇద్దరు పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.

కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్‌, ఆర్‌.జి.ఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులుని సీపీ అవినాశ్‌ మహంతి సస్పెండ్ చేశారు. ఇద్దరిని వేర్వేరు కారణాల్లో బాధ్యులను చేస్తూ సస్పెషన్ వేటు వేశారు. కేపీహెచ్‌బీలో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసినందుకు కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ను సస్పెండ్ చేశారు. భార్యాభర్తల వివాహబంధంలో జోక్యం చేసుకుని వ్యక్తిని చితకబాదినందుకుగాను ఆయనపై చర్యలు తీసుకున్నారు. అలాగే మరో కేసు విషయంలో సరిగా విచారణ చేయనందుకు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు సీపీ అవినాశ్‌.

కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ సస్పెన్షన్:

ఓ దంపతుల వివాదంలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ జోక్యం చేసుకన్నాడు. దాంతో.. భర్తను పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలకు గురి చేశాడు. ఆంధ్రాలో నమోదైన కేసును ఇక్కడ విచారించి.. అందులో భాగంగానే భర్తను పోలీస్‌ స్టేషన్‌నకు పిలిచి తీవ్రంగా కొట్టినట్లు నేరుగా బాధితుడు సీపీ అవినాశ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో సైబరాబాద్ సీపీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించారు. విచారణలో వ్యక్తిని ఇన్‌స్పెక్టర్‌ చిత్రహింసలకు గురిచేశాడని తేలడంతో సీపీ చర్యలు తీసుకున్నారు. తాజాగా కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

శంషాబాద్‌ ఆర్‌.జి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ సస్పెన్షన్:

శంషాబాద్‌ సమీపంలోని హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ కబ్జాకు గురికావడంతో అప్పట్లో అధికారులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదురు కేసును ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నిర్లక్ష్యంగా చేశారు. కేసు నమోదు చేయకుండా ఉన్నారు. ఇటీవల హైకోర్టు సదురు భూములపై జోక్యం చేసుకుంది. ఆ భూములు హెచ్‌ఎండీఏవే అని తేల్చి చెప్పింది. హెచ్‌ఎండీఏ అధికారులు ఇటీవల ఇదే అంశంపై సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. దాంతో.. ఈ వ్యవహరంపైనా విచారణ జరిపించిన సీపీ అవినాశ్‌ మహంతి.. కేసు వ్యవహరంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆర్‌.జీ.ఐ. పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీనివాసుని సస్పెండ్ చేశారు.

Next Story