వరుసగా ప్రముఖ సంస్థలు, రాజకీయ పార్టీలు, నాయకుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతున్నాయి. ఇటీవల ఐపీఎల్ జట్టు ఆర్సీబీతో పాటు పలువురు సెలబ్రిటీల ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఎండీ ఆఫీస్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్‌ను మార్చారు. ఫ్రాంక్లిన్ అని పేరు మార్చి డీపీలో కోతి ఎమోజీని ఉంచారు. దాంతో పాటు వరుస పోస్టులు కూడా చేశారు. అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు ఆర్టీసీ టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్ ఈ అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు.
https://twitter.com/tsrtcmdoffice?s=11&t=YWfDP4VqsKnzlkWVOI47zw
ఈ అకౌంట్ వేదికగానే ప్రజలకు ఓ వైపు ప్రజా రవాణా సంక్షేమం గురించి వివరిస్తూనే, మరోవైపు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు సజ్జనార్ పలు సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని, అవి మోసపూరిత సంస్థలని అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విటర్ వేదికగా ప్రజలకు సూచించారు. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థ అని వెల్లడించాయని చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తున్నాయని చెప్పారు.