ఈనెల 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కొనసాగే తుంగభద్ర పుష్కరాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ 12 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పదేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్లపైబడిన వారరు పుష్కరాలకు రావొద్దని సూచించింది. కరోనా నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కర ఘాట్లలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే టెస్టు రిపోర్టులు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్కానింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నారు.
పుష్కరఘాట్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి ఉంచనున్నారు. అలాగే మాస్కులు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. కోవిడ్ నిబంధనలకు లోబడి పుష్కర స్నానాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా, ఈ తుంగభద్ర పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.2.5 కోట్లు విడుదల చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పుష్కరఘాట్ల వద్ద మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పనులను చేపడుతున్నారు.