సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌

TSRTC to operate 4,233 special buses for Sankranti.సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లే వారికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2022 2:53 AM
సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌తో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు తెలిపింది. పండుగ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని 4,233 ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. వీటిలో 585 బ‌స్సు స‌ర్వీసుల‌కు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించింది. ఈ విష‌యాన్ని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌(ఎండీ) వీసీ స‌జ్జ‌నార్ తెలిపారు.

శుక్ర‌వారం ఆయ‌న ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎండీ మాట్లాడుతూ.. గ‌తేడాది సంక్రాంతికి 3,736 ప్ర‌త్యేక బ‌స్సులు న‌డిపామ‌ని, ఈ సారి వాటికి అద‌నంగా మ‌రో ప‌ది శాతం బ‌స్సుల‌ను పెంచిన‌ట్లు చెప్పారు. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు జ‌న‌వ‌రి 7 నుంచి 15 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయన్నారు. ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం 60 రోజుల ముందుగానే అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్ స‌దుపాయం క‌ల్పించామ‌ని, గ‌తంలో 30 రోజుల ముందు మాత్ర‌మే ఈ సౌక‌ర్యం ఉండేద‌న్నారు. వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కు ఈ సౌక‌ర్యం ఉంటుంద‌ని చెప్పారు.

తెలంగాణ నుంచి ఏపీలోని అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. స‌జ్జ‌నార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి పండుగ స‌మ‌యాల్లో న‌డిపే ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఎలాంటి అద‌నపు ఛార్జీలు వ‌సూలు చేయ‌డం లేదు.

Next Story