ప్రయాణీకులకు మరో షాకిచ్చింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ). ఇప్పటికే డీజిల్ సెస్, రౌండప్, టోల్ సెస్ పేరుతో ఛార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ.. ఇప్పుడు రిజర్వేషన్ చార్జీలను కూడా పెంచేసింది. ఒక్కొ టికెట్ పై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచారు. దీనిపై టీఎస్ ఆర్టీసీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్ చార్జీలు పెంచారని ప్రయాణీకులు వాపోతున్నారు.
అసలే అప్పుల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీకి నిత్యం పెరుగుతున్న డీజిల్ ధరలు తలకు మించిన భారంగా మారాయి. దీంతో ప్రయాణీకులపై ఆర్టీసీ డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో టికెట్‌పై రూ.2, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ సరీసుల్లో రూ.5 చొప్పున సెస్ విధించింది.
అంతకముందు కొన్ని వారాల క్రితం రౌండ్ ఫిగర్ పేరుతో.. పల్లెవెలుగు టికెట్ల ఛార్జీలు రౌండప్ చేసింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధరలు తగ్గగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెరిగింది. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు