తెలంగాణ ఆర్టీసీ మరో కొత్త ప్రయోగం..!
TSRTC plans convert Diesel Buses into Electric. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎలక్ట్రిక్ వాహన విధానం కింద బస్సులను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2021 3:01 PM IST
అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీ రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల నష్టాల నుంచి గట్టెక్కడం పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో కష్టాల నుంచి బయటపడేందుకు సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎలక్ట్రిక్ వాహన విధానం కింద బస్సులను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ఓ ప్రైవేటు సంస్థకు ఒక సిటీ బస్సును కేటాయించింది. ఆ సంస్థ సిటీ బస్సు డీజిల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ ఇంజన్‌గా మార్చి మూడు నెలల పాటు దాని పనితీరును పరిశీలించనుంది.
ఈ మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ వ్యయాన్ని డీజిల్ బస్సు నిర్వహణ వ్యయంతో పోల్చి చూపనుంది. అది అనుకూలంగా ఉంటే మిగతా బస్సులను కూడా అలా మార్చాల్సి ఉంటుందని భావిస్తోంది. అప్పుడు టెండర్లు పిలిచి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నివేదిక ఇచ్చే సంస్థకు కన్వర్షన్ బాధ్యత అప్పగించాలన్నది ఆర్టీసీ ఆలోచన. ఈ ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తే ఒక్క హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలో డీజిల్ రూపంలో అవుతున్న రూ.460 కోట్ల వార్షిక భారం తొలగిపోనుంది. అదే మొత్తం సంస్థకు వర్తిస్తే ఏకంగా రూ.1,926 కోట్ల వ్యయం తగ్గుతుంది.
ప్రస్తుతం డీజిల్ ఇంజన్ల బస్సులను ఎలక్ట్రిక్ ఇంజన్లుగా మార్పిడి చేసే ఖర్చు కూడా భారీగానే ఉంది. ఆ భారాన్ని సైతం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. అందు కోసం ఆర్టీసీ మరో ప్రయోగం చేయాలన్న ఆలోచనలో ఉంది. హైదరాబాద్‌లో 3 వేల బస్సులు తిరుగుతున్నాయి. వాటి రోజువారీగా డీజిల్ ఖర్చు రూ.1.30 కోట్లు. ప్రస్తుతం డీజిల్ ధర ప్రకారం రూ.460 కోట్లను దాటుతుంది. ఇక్కడ ఆర్టీసీకి డీజిల్ ద్వారా కిలోమీటర్‌కు రూ.18 వరకు ఖర్చు అవుతోంది. ఇదే బ్యాటరీ బస్సుతో ఆ ఖర్చు రూ.6 వరకే. అదే కిలోమీటర్‌కు దాదాపు రూ.12 వరకు మిగులుతుంది. దీంతో కన్వర్షన్ భారాన్ని ఆ సంస్థనే తీసుకునేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది. ఆ ఖర్చు భరించినందుకు ఈ మిగులుబాటు మొత్తాన్ని ఆ సంస్థ తీసుకుంటుంది. ఇలా దాదాపు ఐదేళ్లపాటు ఆ సంస్థ ఈ మిగులు మొత్తాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత బస్సులన్నీ ఆర్టీసీ సొంతమవుతాయి. దీంతో మార్నిడి భారాన్ని భరించకుండానే ఎలక్ట్రిక్ బస్సులు చేతికందినట్లు అవుతుందని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది.