10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షల తేదీల్లో రాష్ట్రంలోని
By అంజి Published on 30 March 2023 8:45 AM GMT10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షల తేదీల్లో రాష్ట్రంలోని ఏ ఆర్టీసీ బస్సులోనైనా పదో తరగతి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందేందుకు.. విద్యార్థులు తమ పరీక్ష హాల్ టికెట్‌ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి వెళ్లేముందు, పరీక్షా కేంద్రం నుంచి ఇంటికి వచ్చే ముందు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది, అలాంటి విద్యార్థులు టైమ్‌కు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి.. ఆయా సమయాల్లో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ కాలనీలను కలుపుతూ అన్ని పల్లెవెలుగు బస్సు సర్వీసులను పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఇప్పటికే పరీక్షా సెంటర్ల లిస్ట్‌ను, ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాల్సిన రూట్ల వివరాలను ఆర్టీసీ రీజనల్, డిపో మేనేజర్లకు అందజేయడం ప్రారంభించారు.
మొత్తం 2,652 పరీక్ష కేంద్రాల్లో 4,94,458 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి, మధ్యాహ్నం 12.30 తర్వాత కేంద్రాల నుండి తిరుగు ప్రయాణాలకు వీలుగా బస్సులు లేదా ట్రిప్పులను నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్‌ఎస్‌సీ పరీక్షల సన్నాహాలను సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, గందరగోళం లేకుండా పరీక్షలకు హాజరవ్వాలని సూచించారు.
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అధికారులతో కూడిన ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. హాల్ టిక్కెట్లు సంబంధిత పాఠశాలలకు పంపబడ్డాయి. విద్యార్థులు వాటిని ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.