TSRTC కొత్త చైర్మన్‌గా ముత్తిరెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 3:54 PM ISTTSRTC కొత్త చైర్మన్‌గా ముత్తిరెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్‌లోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి.. సన్మానించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు మాట్లాడుతూ.. అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో తాను ఒకరిగా సమిష్టిగా పని చేసి.. టీఎస్ఆర్టీసీ లాభాల బాటవైపునకు తీసుకెళ్తామని వివరించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ సాధ్యం అవుతుందా అని అనుకున్నాం.. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముత్తిరెడ్డి అన్నారు. ఆనాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ సారధ్యంతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ అంటే ఎక్కడుందని అడిగేవారని.. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపారని సీఎం కేసీఆర్‌ను కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని యావత్ దేశం ఫాలో చేస్తుందని ఆర్టీ కొత్త చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పారు.