టీఎస్‌ఆర్టీసీ ట్రాకింగ్ యాప్‌.. ఏ బస్సు ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు

TSRTC launches bus tracking mobile application. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ప్రయాణాన్ని మరితం సులభతరం చేసింది. ప్రజలు బస్సులలో ప్రయాణించేలా

By అంజి  Published on  27 July 2022 5:44 AM GMT
టీఎస్‌ఆర్టీసీ ట్రాకింగ్ యాప్‌.. ఏ బస్సు ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ప్రయాణాన్ని మరితం సులభతరం చేసింది. ప్రజలు బస్సులలో ప్రయాణించేలా ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మనం ఎక్కాలనుకునే బస్సు.. మనం ఉన్న చోటుకు ఎప్పుడు వస్తుందో తెలిసేలా మొబైల్ అప్లికేషన్ 'టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్' యాప్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాకపోలు సాగించే పుష్పక్‌ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్‌ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, విశాఖపట్నం, ఏలూరు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇలాంటి సదుపాయం ఇప్పటికే రైలు సర్వీసుల్లో ఉంది. రైల్‌ యాత్రి, వేర్‌ ఈజ్‌ మై ట్రైన్‌ యాప్‌ల ద్వారా రైలు లైవ్‌ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా 96 డిపోలు, 4170 ప్రత్యేక తరహా బస్సులను బస్ ట్రాకింగ్ యాప్‌తో అనుసంధానం చేయనున్నామని తెలిపింది. 'టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్' అనే మొబైల్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉందని, ఈ యాప్‌ ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను లైవ్ ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. దీంతో ప్రయాణికుడు తను ఎక్కే బస్సు ఎక్కడుందో ముందే తెలుసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలకు తెలంగాణ బస్సులు వెళ్లిన సందర్భంలోనూ ట్రాకింగ్ చేసుకోవచ్చు.

మొదటగా ఈ ట్రాకింగ్‌ సిస్టమ్‌ కోసం 140 బస్సులను ఎంపిక చేశారు. కంటోన్మెంట్, మియాపూర్‌ - 2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్‌ బస్సుల్లో ట్రాకింగ్‌ సదుపాయం ఉంది. త్వరలో హైదరాబాద్‌లోని అన్ని రిజర్వేషన్‌ సర్వీసులను కూడా ట్రాకింగ్‌ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. ఈ యాప్ ద్వారా కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపై కూడా ప్రయాణికులు తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ప్రయాణికులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆర్టీసీ, ఎండీ కోరారు. మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ www.tsrtc.telangana.gov.inలో కూడా అందుబాటులో ఉంది.

Next Story
Share it