టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఆగస్టు 15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఫ్రీ జర్నీ
TSRTC Bumper offer to children who born on August 15th.ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)
By తోట వంశీ కుమార్
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణీకుల మనస్సులను గెలుచుకుంటోంది. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ ఆఫర్లను ప్రకటిస్తూ ఎక్కువ మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మరో బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న తరుణంలో తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాలు వచ్చే వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదండోయ్.. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా టీఎస్ ఆర్టీసీ నేటి నుంచి 21 వరకు వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ రోజు(మంగళవారం) నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు ఆర్టీసీ బస్సుల్లో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయనుంది. టీ-24 బస్ టికెటును ఆ రోజున(ఆగస్టు15న) రూ.75(సాధారణ రోజుల్లో రూ.120)కే విక్రయిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఉద్యోగులందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరుకానున్నారు.
ఇంకొన్ని ఆఫర్లు ఇవే..
- టీటీడీ ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు
- ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్ 75 కిలోమీటర్ల వరకు ఉచిత రవాణా
- టాప్-75 ప్రయాణికులకు ఒక ట్రిప్ టికెటు ఉచితం
- శంషాబాద్ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్ పోర్ట్ సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే చాలు
- 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు. 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్ష